జాండ్రపేట గ్రామప్రజలకు శుభవార్త..!

JYOTHI SAMBARAM IMAGES


సృష్టి కారకుడైన బ్రహ్మ విశ్వ సృష్టికి ఉపక్రమించి పంచ భూతములను తద్వారా దేవ, దానవ, మానవ, పశు పక్ష్యాది జీవ రాశులను సృజించెను.ఆ జీవరాసులలో పశు పక్ష్యాదులు ఎదుగుతూ దేహాభిమానము లేక సిగ్గు తెలియక నగ్నముగా సంచరించు చున్నవి. కాని బుద్ధి జీవులైన దేవ, దానవ, మానవ జాతులు దిగంబర సంచారము చూసి బ్రహ్మ కడుపు జుగుప్స పొంది మిక్కిలి భాదతో దేహ ఆచ్చాదనకు అవసరమైన వస్త్రమును తయారుచేయుటకు సిద్దపడెను. అయితే ఎంత ప్రయత్నించినా బ్రహ్మకు వస్త్రోత్పత్తి సాద్యము కాలేదు. దీనితో బ్రహ్మ కైలాసమునకేగి సృష్టి లోపమును నివేదించగా ఆ పరమేశ్వరుడు తరునోపాయముగా "దేవల మహర్షి" అనే దివ్య పురుషుని సృష్టించి ఆ మహాత్ కార్యమును ఆప్పగించెను. అంతట ఆ దేవల మహర్షి వస్త్రమును సృష్టించి, లోకమునకు అందించి సర్వ లోకాలకు నాగరికత నేర్పించెను. ఆ విధముగా మానరక్షణకు వస్త్ర సూత్ర సృష్టి చేయుట చేత "దేవలమను బ్రహ్మ " గా కీర్తింపబడెను. ఆ దివ్య పురుషుని వంశ శంభుతలే మన దేవాంగులు. మన దేవాంగులను పూర్వము "దేవ బ్రాహ్మణులూ" అని కూడా పిలిచేవారు

Friday, December 30, 2011

కోతి చేసిన న్యాయం


అనగా అనగా చిన్ను, బుజ్జి అనే రెండు పిల్లి పిల్లలు ఉండేవి. ఎక్కడికి వెళ్లాలన్నా అవి రెండూ కలిసి వెళ్లేవి. అలాగే కలిసి ఆడుకునేవి. అయితే అవి చిన్నపిల్లలు కావడం వల్ల చీటికి మాటికి తగవులాడుకునేవి. ఒకరోజు ఆడుకుంటూ ఉండగా వాటికి ఒక రొట్టెముక్క కనిపించింది. ఆకలి మీద ఉన్న చిన్ను, బుజ్జిలు ఆ రొట్టెముక్క కోసం పరిగెత్తాయి. రెండూ ఒకేసారి రొట్టెముక్కను అందుకున్నాయి. ‘‘ఈ రొట్టెను నేను ముందు అందుకున్నాను.

ఇది నాది’’ అంది చిన్ను. ‘‘అదేం కుదరదు! దాన్ని ముందు చూసింది నేను. ఆ రొట్టె నాకు చెందవలసినది’’ అంది బుజ్జి. అలా అవి రెండూ తగవులాడుకోవడం మొదలుపెట్టాయి. ఒకదాని మాట మరొకటి వినిపించుకోకుండా రొట్టెముక్క కోసం కీచులాడుకుంటూనే ఉన్నాయి. ఇదంతా దూరం నుంచి ఒక కోతి గమనించింది. అది మంచి తెలివైనది. ‘‘ఈ రెండు పిల్లుల తగవులో నేను లాభం పొందవచ్చు’’ అనుకుంది.

చిన్ను, బుజ్జిల దగ్గరకు వెళ్లి ‘‘మీరిద్దరూ మంచి స్నేహితులు కదా! ఇంత చిన్న విషయానికి తగవులాడుకోవడం ఏమీ బాగాలేదు. నేను మీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను. నా దగ్గర ఒక త్రాసు ఉంది. దాని సహాయంతో ఆ రొట్టెముక్కను మీ ఇద్దరికీ సమానంగా పంచుతాను’’ అంది. కోతి పరిష్కారం న్యాయంగా అనిపించి వాటి దగ్గర ఉన్న రొట్టెముక్కను దాని చేతికి ఇచ్చాయి పిల్లిపిల్లలు. కోతి రొట్టెముక్కను రెండు ముక్కలు చేసింది. త్రాసులో ఒక్కోవైపు ఒక్కోముక్క వేసింది.

ఒకముక్క కొంచెం పెద్దగా ఉండడం చేత త్రాసు ఒక వైపుకు వంగింది. ‘‘అరే, రెండు ముక్కలు సమానంగా లేవే’’ అని కోతి పెద్దముక్కను కాస్త కొరికి తిని మళ్లీ వాటిని కొలిచింది. ఈసారి త్రాసు మరో వైపుకు వంగింది. ‘‘ఈసారి కూడా ముక్కలు సమానంగా లేవు’’ అని కోతి మరో ముక్కను కాస్త కొరికింది. అలా ఒక్కోసారి ఒక్కో వైపు ఉన్న ముక్కను కొరుకుతూ ఉంటే చిన్ను, బుజ్జిలు బిక్క మొహం వేసుకొని చూస్తూ ఉండిపోయాయి. కోతి అలా చేస్తూ చేస్తూ రొట్టెను మొత్తం తినేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది. ‘‘మనలో మనం కీచులాడుకోకుండా ఆ రొట్టెను పంచుకొని ఉంటే బాగుండేది. మన తగవులాట వల్ల కోతి లాభం పొందింది’’ అని చిన్ను, బుజ్జిలు అనుకున్నాయి.

నీతి: మనలో మనం తగవులాడుకోవడం వల్ల మూడవ వ్యక్తి లాభం పొందుతాడు. అందుకే ఐకమత్యమే మహాబలం అన్నారు పెద్దలు.
 

No comments:

Post a Comment